Saturday, July 4, 2020

పాఠశాలల్లో పిల్లలకు ‘ ఇంగ్లీష్ ‘ ఎందుకు రావటం లేదు ?

పాఠశాలల్లో  పిల్లలకు ‘ ఇంగ్లీష్ ‘ ఎందుకు రావటం లేదు ? పరాయి భాషను నేర్పాల్సిన విధంగా (శాస్త్రీయ పద్దతులలో) నేర్పుతున్నామా ? 

      తెలుగు ( మాతృ భాష ) లో  పాఠశాల విద్య ఉంటే పిల్లలకు పాఠాలు బాగా అవగాహన అవుతాయి , వారిలో  సృజనాత్మకత బాగుంటుంది అనేది "సూర్యుడు తూర్పున ఉదయించును" అన్నంత సత్యం . ఉద్యోగావకాశాలలో వచ్చిన మార్పు, ఆ అవకాశాలను అందిపుచ్చుకోవటానికి  'ఇంగ్లీష్'  భాష అవసరం  అని వివిధ వర్గాల వారు భావించటం, ఇంగ్లీష్ భాష రావాలంటే 'పిల్లలను ఇంగ్లీష్ మీడియం బడిలో '  చదివించటమే మార్గమని నమ్మారు . దీనికి ఒక ముఖ్య కారణం , అప్పటికే  “ క్రిస్టియన్ మిషనరీ స్కూల్స్ లో  ఇంగ్లీష్ మీడియం లో బోధించడం” చూసిన తల్లిదండ్రులకు  ఇదే ఆచరణీయమైన మార్గంగా కనిపించింది. ఇక్కడే ఉపాధ్యాయులు, విద్యావేత్తలు,  మేధావి వర్గం, ప్రభుత్వాలు ఘోరంగా వైఫల్యం చెందాయి . విద్యార్ధుల భవిష్యత్తును, తల్లిదండ్రుల ఆకాంక్షలను, జాతి అభివృద్ధిని దృష్టిలో ఉంచుకొని “ ఆచరణీయమైన పరిష్కారం చూపించటంలో ఉపాధ్యాయ వర్గం, విద్యావేత్తలు, మేధావి వర్గం ఘోరంగా వైఫల్యం చెందాయి. దాని పర్యవసానమే, సమాజం లోని అత్యధిక శాతం  తల్లిదండ్రులు, తమ పిల్లలు నాలుగు ముక్కలు ఇంగ్లీష్ లో మాట్లాడాలంటే, 1 వ తరగతి నుండే ఇంగ్లీష్ మీడియం లో చదివించటం మాత్రమే ఏకైక  మార్గం  అని బలంగా నమ్ముతున్నారు  .



అసలు  తల్లిదండ్రులు కోరుకుంటున్నదేమిటి ? ఇంగ్లీష్ లో మాట్లాడితే  ఉద్యోగాలొస్తాయి అన్న నమ్మకంతో “  వారి పిల్లలు కూడా ఇంగ్లీష్ లో మాట్లాడాలని కోరుకుంటున్నారు అంతే  “ .
        పత్తిపండించటానికి బళ్ళారి పోయిన రైతులు 3 నెలల్లో కన్నడ లో సులువుగా మాట్లాడుతున్నట్లుగా, పనులకు మద్రాస్ వెళ్ళే  కూలీలు 3 నెలలలో తమిళం గలగలా మాట్లాడుతున్నట్లుగా, బడి ముఖం చూడని నేషనల్ పర్మిట్ ఉన్న లారీ డ్రైవరు ‘ 4-5 భాషలు ‘ మాట్లాడుతున్నట్లుగా  రోజూ ఠoచనుగా, క్రమం తప్పకుండా బడికి పోయి, ఉదయం నుండి సాయంకాలం దాకా బడిలో పాఠాలు నేర్చుకుంటున్న మన పిల్లలు ఇంగ్లీష్ లో మాట్లాడలేక పోవటానికి కారణం ఏమిటి ?

          3 నెలల్లో రైతులు, కూలీలు, లారీ డ్రైవర్లు, ఇతర పనులు చేసే వారు వివిధ భాషలు నేర్చుకొని ఆయా భాషల్లో అనర్గళంగా మాట్లాడ గలిగినప్పుడు (తేడా వస్తే అదే భాషలో పోట్లాడ గలిగినప్పుడు)  10 సంవత్సరాలు బడికి (అది ప్రభుత్వ బడి అయినా / ప్రైవేట్ బడి అయినా ; ఇంగ్లీష్ మీడియం అయినా / తెలుగు మీడియం అయినా) వెళ్ళిన పిల్లలు, ఎంతో చురుకైన పిల్లలు, తెలివితేటలు కలిగిన పిల్లలు  “ ఇంగ్లీష్ మాట్లాడ లేక పోవటం ఏమిటి ?” .
బడికి వెళ్ళే పిల్లలకన్నా, రైతులు, కూలీలు, లారీ డ్రైవర్లలో  ‘నేర్చుకొనే’ గుణం ఎక్కువగా ఉంటుందా ? లేక తెలివి తేటలు ఎక్కువగా ఉన్నాయా ? లేక బడిలో ఇంగ్లీష్ భాష నేర్పే విధానం లోనే లోపం ఉందా ?

“ చీమలు నడిస్తే బండ రాళ్ళయినా అరుగుతాయి “ అన్నది నానుడి  ..... బడిలో 10 ఏళ్ళు ఇంగ్లీష్ నేర్చుకున్న పిల్లలు , పట్టుమని 10 నిమిషాలు  ఇంగ్లీష్ లో మాట్లాడలేక పోతున్నారంటే లోపం ఎక్కడుంది ? (ఇంగ్లీష్ లో మాట్లాడటం అంటే, బట్టీ పట్టించిన ఉపన్యాసం వేదికపై చిలక పలుకుల్లాగా చెప్పించటం కాదు. కనీసం, తక్కువలో తక్కువ  “ పని కోసం మద్రాస్ వెళ్ళిన కూలీలు, వివిధ సన్నివేశాలలో/వివిధ అవసరాల కోసం “ తమకు కావలసింది, తాము చెప్పాలనుకున్నది తమిళంలో సులువుగా చెప్తున్నట్లుగా మాట్లాడ గలగటం “.         

యూరప్ లోని వివిధ దేశాల వారు వారి పిల్లలకు బడిలో ‘ఇంగ్లీష్’ ఎలా నేర్పుతున్నారు ?

  మనదేశం లో వివిధ రాష్ట్రాలలో వారి వారి మాతృభాషలు మాట్లాడుతున్నట్లుగా, యూరప్ లోని వివిధ దేశాల ప్రజలు  వారి వారి మాతృభాషలు మాట్లాడతారు . (యూరోప్ లో ఒక్క ఇంగ్లాండ్ లో తప్ప , మిగిలిన దేశాలలో వారి వారి మాతృభాషలలోనే  మాట్లాడతారు. మాతృ భాషలోనే విద్యాబోధన జరుగుతుంది ).

  2002 లో యూరోపియన్ యూనియన్ ఒక తీర్మానం చేసింది . అది  “ యూనియన్ లోని వివిధ దేశాలలోని ప్రజల మధ్య  స్నేహపూర్వక సంబంధాలు పెంపొందించటం కోసం ,  ఆయా దేశాలలోని బడిలో చదువుకుంటున్న విద్యార్ధులకు, వేరే దేశాలలో మాట్లాడే రెండు భాషలు విధిగా నేర్పాలి ”అని . ఈ పాలసీ “ మన  రాష్ట్రం లోని త్రిభాషా సూత్రం లాంటిదే “..... అనగా మాతృ భాష (తెలుగు)  , జాతీయభాష ( హిందీ ) , ఇంగ్లీష్ ను పాటశాలల్లో బోధించటం లాగా అన్నమాట.

  ఫిన్లాండ్ తో సహా అన్నీ యూరోపియన్ దేశాలలో (అనగా ఇంగ్లీష్ మాతృ భాష కానీ వారు) నూటికి 90% మంది పాఠశాల  విద్యార్ధులు ఇంగ్లీష్ ను మొదటి లేదా రెండవ ఫారిన్ భాషగా నేర్చుకుంటున్నారు. వారికి ఒకటవ/మూడవ  తరగతి నుండి 9 /10 వ తరగతి వరకు సగటున (అనగా 7 నుండి 10 సంవత్సరాలలో) 643 గంటలు మాత్రమే ఇంగ్లీష్ ను ఒక సబ్జెక్టు గా చెప్తున్నారు . ఈ 643 గంటల పాఠానికే , 9 నుండి 11 వ తరగతి పిల్లలలో 42 % మంది ఇంగ్లీష్ లో ధారాళంగా మాట్లాడ గలుగుతున్నారు (అనగా CEFR B1, B2 లెవెల్). సాఫ్ట్ వేర్  కంపెనీలలో, BPO లలో పనిచేయటానికి ఈ  CEFR B1,  B2 లెవెల్ ఇంగ్లీష్ వచ్చి ఉండాలి.  (CEFR- Common European Framework of Reference for Languages )

  ఆంధ్ర ప్రదేశ్ లో తెలుగు మీడియంలో చదివే వారు ‘ 1 వ తరగతి నుండి 10 వ తరగతి వరకు ‘ ఇంగ్లీష్ ను  1500 గంటలు ఒక సబ్జెక్టు గా నేర్చుకుంటున్నారు . అదే ఇంగ్లీష్  మీడియంలో చదివే వారికి  ‘ 1 వ తరగతి నుండి 10 వ తరగతి వరకు ‘ ఇంగ్లీష్ లో 6375  గంటల బోధన జరుగుతుంది ( ఇంగ్లీష్ , లెక్కలు, సోషల్ ,సైన్స్ అన్నీ ఇంగ్లీష్ లోనే ఉంటాయి , ఇంగ్లీష్ లోనే బోధిస్తారు ).

 మాతృభాషా మాధ్యమం లో చదువుతూ,  643 గంటలు మాత్రమే ఇంగ్లీష్ నేర్చుకుంటున్న  యూరోపియన్ పిల్లలకు (తమ మాతృభాష కాని) ఇంగ్లీష్ లో CEFR B1 , B2 వస్తుంటే మన ఆంధ్రప్రదేశ్ లో  1500 గంటలు ఇంగ్లీష్ నేర్చుకుంటున్న తెలుగు మీడియం పిల్లలు యూరోపియన్ విద్యార్ధుల కన్నా కనీసం 2 రెట్లు అధికంగా మంచి ఇంగ్లీష్ రావాలి. అదే  6375 గంటలు ఇంగ్లీష్ లో పాఠాలు జరుగుతున్న ఇంగ్లీష్ మీడియం పిల్లలు అయితే, కనీసం 10 రెట్లు మంచి ఇంగ్లీష్ మాట్లాడాలి కదా !

  2 నుండి 10 రెట్లు అధిక గంటలు ఎక్కువగా ఇంగ్లీష్ లో పాఠాలు జరుగుతున్నా, మన ఆంధ్ర ప్రదేశ్ లోని  పిల్లలకు ఇంగ్లీష్ రాకపోవటానికి కారణం ఏమిటి ? తప్పు ఎక్కడ జరుగుతుంది ? కారణం ఎవరు ? అసలు మన పాఠశాలల్లో ఇంగ్లీష్ ను బోధించే పద్దతి సరైనదేనా ? మీరే  విజ్ఞతతో  ఆలోచించండి!!     

 ఇట్లు ,
 డాక్టర్ గుంటుపల్లి శ్రీనివాస్ DNB , MRCP(UK)

No comments:

Post a Comment